జగన్ రెడ్డి పాలనపై సమగ్ర విశ్లేషణ: లాభాలు, నష్టాలు మరియు భవిష్యత్తు చిక్కులు
ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనే నినాదంతో, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి, అనూహ్యమైన విజయం పొంది, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన శైలిలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు . ప్రజల వద్దకు పాలన అనే నినాదంతో అనేక సంచలనాత్మకమైన సంక్షేమ పథకాలకు నాంది పలికారు. రాజకీయాల్లో కొత్త శకం మొదలుపెట్టారు. అతని పదవీకాలం ప్రశంసనీయమైన విజయాలు తోపాటు అనేక వివాదాస్పదములతో నిండిపోయింది. క్రొత్త ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక-రాజకీయ ముఖ చిత్రం ఆవిష్కరించబడింది. ఈ కథనంలో, జగన్ రెడ్డి పాలనలోని సాధకబాధకాలను, ఆయన పాలనపై సమతుల్య అంచనాను అందజేస్తాను.

మధ్యతరగతి మరియు పేద పౌరుల అభ్యున్నతి లక్ష్యంగా జగన్ రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ప్రవేశపెట్టింది. విద్యా దీవెన, అమ్మఒడి, ఆటోడ్రైవర్లకు ఆర్థిక సహాయం వంటి పథకాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపాయి, ప్రజల నమ్మకాన్ని మరియు మద్దతును పొందాయి. ప్రతి సంవత్సరం రమారమి లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ఈ పథకాలు ద్వారా సరాసరి పేదవారికి చేరటం ఒక మంచి పరిణామం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారు అనేక లబ్దులు పొందారు.
సమాజంలోని వివిధ వర్గాలకు మేలు జరిగేలా నిధుల కేటాయింపులో సామాజిక న్యాయానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తోంది. మత్స్యకారులు మరియు ఇతర బలహీన వర్గాల వారికి అలాగే వారి విభిన్న అవసరాలు తీర్చే విధంగా పథకాలు రచించడం అమలు చేయటం జరిగింది. క్షేత్రస్థాయిలో అనేక క్రింది స్థాయి వర్గాలు ప్రభుత్వ పథకాల వైపు బాగా ఆకర్షితులయ్యారు.

ప్రజల వద్దకు పాలన అనే కార్యక్రమం ద్వారా సచివాలయం ఉద్యోగులు మరియు వాలంటీర్ల ను క్షేత్రస్థాయిలో నియమించడం జరిగింది. వారు ప్రజా సంక్షేమం విషయంలో, క్షేత్రస్థాయి సమాచార విషయంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయడం ప్రభుత్వానికి మద్దతును పెంచే వైపు దోహదం చేస్తుంది. ఈ అంశం భవిష్యత్తులో జరిగే ఎన్నికలలో గణనీయమైన ఎన్నికల మద్దతును పొందే అవకాశం ఉంది.
విమర్శలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం మౌలిక సదుపాయాల , అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ప్రచార ఆర్భాటాలు లేకుండా మౌలిక సదుపాయాల అభివృద్ధి విషయమై క్షేత్రస్థాయిలో ఒక అడుగు ముందుకు వేసినట్లే అని ప్రజల భావిస్తున్నారు. జగన్ యొక్క ప్రజాకర్షక విధానం, తెలివిగల రాజకీయ వ్యూహం లు కొన్ని సామాజిక వర్గాలలో ప్రభుత్వం పై ఇష్టత పెంచింది. అధికార పార్టీ ప్రతిష్టను బలపరిచింది. జనాభాలోని కొన్ని వర్గాలు ప్రభుత్వానికి గట్టి మద్దతు ఇస్తున్నారు.

“రావాలి జగన్ కావాలి జగన్” అనే జనాదరణ పొందిన నినాదంతో హైలైట్ చేయబడిన జగన్ రాజకీయ ప్రచారం బాగా అమలు చేయబడింది, “మీ కుటుంబానికి మంచి జరిగింది అంటే నాకు ఓటు వేయండి” అన్న నినాదం క్షేత్రస్థాయిలో ప్రజా దర్బారులో విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. ఇది ప్రజల మద్దతును కూడగట్టింది మరియు పార్టీ ఎన్నికల విజయానికి దోహదపడే అంశం.
వస్తున్న ప్రభుత్వ రాబడి లో సింహభాగం సంక్షేమ కార్యక్రమాలకు వెళ్ళటంతో అనవసర వ్యయాలను అరికట్టే దిశగా పాలన సాగుతోంది. అత్యవసరమైనటువంటి పథకాలకు మాత్రమే నిధులు కేటాయించడంతో అనవసర ఖర్చులు తగ్గాయా అని కొందరు భావిస్తున్నారు.
నాణానికి మరో కోణంలో జగన్ పాలనలో అనేక వివాదాస్పద కార్యక్రమాలు కూడా ఉన్నాయని ప్రతిపక్షం సున్నితంగా, ప్రత్యక్షంగా, బాహాటంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లడం జరిగింది.
అందులో ముఖ్య అంశం రాజధానిని మార్చాలనే వివాదాస్పద నిర్ణయం, పరిపాలనాపరమైన తప్పులతో పాటు రాష్ట్ర భవిష్యత్తు గురించి అనిశ్చితిని సృష్టించింది. రాజధాని అంశం ఒక వర్గం వారికి అనుకూలంగా ఉంది అన్న ప్రభుత్వ వాదనను, ఈ విషయంలో తప్పు అని ప్రజాక్షేత్రంలో గట్టిగా నమ్మటం మొదలుపెట్టారు. తమ పొలాన్ని పోగొట్టుకున్న రైతులు వారి ఆక్రందనలు నిశ్శబ్దంగా అనేకమంది మనసుల్లో ఇది ప్రభుత్వం చేస్తున్న తప్పు అని గట్టిగా నాటుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు
ప్రతిపక్షాల అవినీతి ఆరోపణలు అధికార పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి, దాని చిత్తశుద్ధి మరియు పాలనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇసుక , మద్యం లో జరుగుతున్నటువంటి అవినీతి ఆరోపణలు ప్రతిపక్షం ప్రజల దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈ రెంటి విషయంలో బీద మరియు మధ్యతరగతి కుటుంబాలు కూడా బాగా ఇబ్బంది పడ్డాయి అన్న విషయం అందరికీ తెలిసే విధంగా గ్రామీణ ప్రాంతాలలోకి తీసుకుని వెళ్ళటం ప్రతిపక్షంగా ఒకరకంగా విజయం సాధించింది అని చెప్పవచ్చు. ఈ కోణాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారు అన్నది , ఎన్నికల సమయంలో నిశ్శబ్ద విప్లవముగా మారుతుందా అన్నది చూడాలి.
జగన్ హయాంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని, ప్రాజెక్టుల జాప్యం, నీటిపారుదల వంటి కీలకమైన ప్రాంతాల్లో స్తబ్దత ఏర్పడిందని విమర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోలవరం విషయంలో అనుకున్నంత పనులు జరగలేదని అదేవిధంగా అనేక అవరోధాలు జరిగాయని కూడా వదంతులు ఉన్నాయి.
అది కాకుండా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు విషయంలో కూడా సరైన చర్యలు తీసుకోలేదని తద్వారా వాటిని పూర్తి చేయు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులు సమకూర్చటంలో జాప్యం ఎక్కువగా జరిగిందని విమర్శలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. దానికి తోడు రాష్ట్రంలో సరైనటువంటి ప్రోత్సాహకాలు, ప్రభుత్వ సహకారాలు అంతగా లేకపోవడం వలన పరిశ్రమలు రాష్ట్రంలో అనుకున్న రీతిలో రాలేదన్నది మరొక విమర్శ. పరిశ్రమల స్థాపనలో ఉద్యోగ అవకాశాలు ఏర్పరిచే విషయంలో ప్రభుత్వ తీరు మరింత ప్రోత్సాహకరంగా ఉంటే బాగుంటుందని పలువురి అభిప్రాయం.
న్యాయపరమైన అనేక అంశాల విషయంలో హైకోర్టు, కోర్టులు ప్రభుత్వ పని తీరుపైన, అధికారుల పైన అనేకమార్లు విమర్శలు కుప్పించాయి. న్యాయపరమైన అంశాల పైన ప్రభుత్వం అనేకమార్లు మొట్టికాయలు తినడం జరిగింది. కోడి కత్తి కేసు విషయంలో, వివేకానంద రెడ్డి హత్య విషయంలో ప్రభుత్వ తీరు అనేక సందేహాలకు తెరలేపింది
మాతృభాష విషయంలో తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు అన్న విమర్శ కూడా ఉంది. మాతృ భాష ను పణంగా పెట్టి ఇంగ్లీషు మీడియం విద్యను ప్రోత్సహించాలనే నిర్ణయం విమర్శలకు మరియు సాంస్కృతిక గుర్తింపు ఆందోళనలకు దారితీసింది.
పెట్టుబడిదారులను ఆకర్షించడంలో వైఫల్యం మరియు సాంఘిక సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టడం వల్ల రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై ప్రభావం చూపుతూ దీర్ఘకాలిక ఆర్థిక సవాళ్లను పూర్తిస్థాయిలో పరిష్కరించలేకపోయిందని ప్రభుత్వంపై చాలా విమర్శలు వస్తున్నాయి. కొత్త పెట్టుబడిదారులకు సరైన రాయితీలు లేకపోవడం ఉన్న పెట్టుబడులు, పరిశ్రమల విషయంలో సరైన నమ్మకం కలిగించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ విఫలంగా పారిశ్రామికవేత్తలు అభివర్ణిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి పరిపాలన కొత్త తరహా పరిపాలనకు నాంది పలికింది. విజయాల గురించి రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటూ ఉంటే, అనేక వివాదాస్పద కార్యక్రమాలు ప్రభుత్వ పనితీరుపై నీలి మేఘాలు సృష్టిస్తున్నాయి. సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయి అని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. కానీ పాలన విఫలం అయింది అని ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందని , ప్రతిపక్షాలు కలసికట్టుగా ఎదుర్కోవాలి అని ఎత్తులు పొత్తులతో ముందుకు వెళ్ళటం కాస్తంత ఇబ్బందికరమైన విషయమే. పాలనాపరమైన అలసత్వం వలన అటు ప్రజలు ఇటు ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నట్లు అవగతం అవుతోంది. రాష్ట్రం సంక్షేమం దిశగా ప్రయత్నం చేస్తూ , సమగ్ర అభివృద్ధి విషయంలో అశ్రద్ధ చేస్తుందని చాలామంది గుసగుసలాడుకుంటున్నారు. సోషల్ ఇంజనీరింగ్ ద్వారా , సంక్షేమ పథకాల ద్వారా మరల ప్రజల మన్ననలు పొందవచ్చు అని ప్రభుత్వం యోచిస్తోంది. పాలన వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వం వైపు మొగ్గు చూపటంతో ఎలక్షన్లు సజావుగా జరగకపోవేమో అని మరి కొంతమంది ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. జగన్ చాలా రిస్క్ తీసుకొని కొత్త తరహాలో మొదలుపెట్టిన ప్రజల వద్దకు పాలన ఎంతవరకు తమకు విజయం సాధించి పెడుతుందో అన్న విషయం రాబోయే మే నెలలో ప్రజా తీర్పుతో తేటతెల్లమవుతుంది.
visit arjasrikanth.in for more insights
One response to “ఆంధ్రప్రదేశ్‌లో జగన్ రెడ్డి పాలన: విజయాలు, సవాళ్లు”
మీ విశ్లేషణ బాగుంది సార్
LikeLike