అమెరికాలో చక్కగా స్థిరపడాలి, మెరుగైన అవకాశాలు పొందాలి అని ఆశిస్తూ ప్రతి సంవత్సరం రెండు లక్షల పైగా మన యువత అడుగులు వేస్తున్నారు. అమెరికా జీవనశైలికి ఉన్నటువంటి ఆకర్షణ అలాంటిది. కాకపోతే ఈ మధ్యకాలంలో భారత సంతతికి సంబంధించిన కొంతమంది యువకులపై జరుగుతున్న దాడులు కాస్తంత ఆందోళన కలుగజేస్తున్నాయి. అమెరికాలో మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి. విదేశాలలో ఆకాంక్షలు మరియు కఠినమైన వాస్తవాల మధ్య పూర్తి వ్యత్యాసాన్ని సుస్పష్టం చేస్తున్నాయి.

2022-2023 విద్యా సంవత్సరంలో, అమెరికాలో విద్యను అభ్యసిస్తున్నటువంటి భారత విద్యార్థుల సంఖ్య 268,923. గత సంవత్సరము కంటే ఇది 11% ఎక్కువ. అలాగే అమెరికా జనాభాలో భారతీయ అమెరికన్లు 1.35% ఉన్నందున, వారి ద్వారా అనేకమంది భారతీయ విద్యార్థులు అమెరికాలో విద్యను అభ్యసించడానికి ముందుకు వస్తున్నారు. ఇంతకుముందు లేనటువంటి ఈ దాడులు ఇప్పుడు కొంత ఎక్కువ అవటంతో భద్రత విషయంలో కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం యొక్క ఆవశ్యకత పెరుగుతుంది
ఈ యువకులలో ఎక్కువ మంది భారతదేశంలోని మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చారు. మంచి భవిష్యత్తు గురించి, ఉన్న పొలం, ఆస్తిని తాకట్టు పెట్టి అమెరికాకు చేరుకునేవారు చాలామంది ఉన్నారు. అక్కడ స్థిరపడిన తర్వాత కుటుంబ బాధ్యతలు మోయాలి అన్న ఆకాంక్ష కూడా చాలామంది మధ్యతరగతి యువతలో ఉంది. కాకపోతే అమెరికాలో అడుగుపెట్టిన సమయం నుండి ఒంటరితనం, నిరుత్సాహకరమైనటువంటి జీవనశైలి, ఆర్థిక ఇబ్బందులు, సాంస్కృతిక మార్పు మున్నగు ఇబ్బందులతో , సవాళ్లతో మొదటి సంవత్సరం లో సతమతమవుతూ ఉంటారు. వారి ఆలోచనలు అంచనాలకు అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. ఆ పరిస్థితులకు అనుగుణంగా మారటానికి కొంత సమయం పడుతుంది. కొన్ని సందర్భాలలో సంపాదన మొత్తం ఖర్చులకు సరిపోతూ ఉంటుంది. మొత్తానికి అనేక వడుదుడుకుల మధ్య తమ జీవితం అమెరికాలో మొదలవుతుంది.
కాస్తంత కుదుటపడిన తర్వాత ఉద్యోగం సౌకర్యవంతమైనటువంటి జీవనశైలి, సొంత ఇల్లు కాస్తంత సొమ్ము పొదుపు చేసుకోవటం గమ్యాలుగా చేసుకుని పయనం మొదలవుతుంది.కాస్తంత పొదుపు చేసుకుని తమ తల్లిదండ్రులకు ఆసరా అవటానికి కూడా ప్రయత్నాలు మొదలవుతాయి. తీసుకున్న బాకీ తిరిగి ఇవ్వటం మొదలవుతుంది. ఈ ఒడిదొడుకులు ఎదుర్కొనేసరికి జీవితంలో సగభాగం అయిపోతుంది. సాధించాలి అనే కోరిక సాధించటానికి మధ్య ఒంటరి పోరాటం జరుగుతుంది.
అమెరికాలో అనేక అవకాశాలు ఉండటంతో సాధన విషయంలో ఉత్సాహం ఉంటూనే ఉంటుంది. అంతేకాకుండా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలో పనిచేయటం , అత్యాధునిక ప్రాజెక్టులతో ముడి పడటం చక్కటి జీవన ప్రమాణాలను పొందటం వారికి జీవన గమ్యంగా మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. దానితోపాటు మెరుగైన మౌలిక సదుపాయాలు పని-జీవితము మధ్య సమతుల్యత, నిర్దిష్టమైన చట్టాలు, క్రమేపి యువతలో వారి సామర్థ్యం పైన తమ కాళ్లపై తాము నిలబడగలము అన్న నమ్మకం రోజురోజుకీ పెరగడం జరుగుతుంది. అలాంటి గుండె ధైర్యంతో భారత సంతతికి చెందిన అనేక మంది యువత ఈరోజు అత్యున్నత స్థానాలలో ఉంటూ భారతదేశానికి తలమానికంగా భారత గౌరవాన్ని అమెరికాలో మరింత ప్రస్ఫుటంగా ప్రసరిస్తున్నారు

అయితే ఇటీవల కాలంలో మన యువత పైన దొరుకుతున్నటువంటి దాడులు అకాల మరణములు జాతి వివక్షత విద్వేషపూరిత నేరాలు ఇలాంటివి యువత భద్రత పైన ఆందోళన కలిగి చేస్తూ ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం కాస్తంత అనిశ్చితి మొదలవుతోంది.ఇలాంటి విద్వేషపూరితమైనటువంటి నేర ప్రవృత్తిని తేలికగా కొట్టి పారవేయలేము అని చెప్పి వాస్తవికతను విస్మరించలేము. విదేశాలలో విద్య మరియు అవకాశాల సాధన అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, విదేశీ భూమిలో జీవితంతో ముడిపడి ఉన్న స్వాభావిక నష్టాలు మరియు సవాళ్లను గుర్తించడం మరియు పరిష్కరించడం అత్యవసరం. యువ జీవితాల విషాదకరమైన నష్టం అన్నింటికంటే భద్రత మరియు శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది.
అక్కడ స్థిరపడిన విద్యాధికులు ఇప్పటికే అనేక కార్యక్రమాల ద్వారా చక్కటి అవగాహన కల్పిస్తున్నారు కానీ మారుతున్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా వీరు మరి కాస్తంత సమయం వెచ్చించి కొత్తగా వస్తున్నటువంటి వారికి సరైన అవగాహన, సరైన మార్గదర్శకం చూపించినట్లయితే అక్కడికి వెళుతున్నటువంటి యువతకు మరింత చేయూతనిచ్చిన వాళ్ళమవుతాం. తద్వారా యువత మొదటి రోజు నుండే మానసికంగా దృఢంగా తయారయ్యి రాబోయే సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తమని తాము మలుచుకోవడంలో చక్కటి పద్ధతులను అవలంబించడం జరుగుతుంది. అంతేకాకుండా భారత సంతతికి చెందిన వారందరూ ఒక జాయింట్ ఫ్యామిలీ గా కలిసిమెలిసి ఉండటం మొదలుపెడితే ఎలాంటి ఇబ్బందులు కలిగిన కూడా ఒకరు తోడు ఉండి సమస్యకు పరిష్కారం చూడటంతో పాటు, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మరింత మెరుగైన సులువైన జీవన శైలికి నాంది పలకడం జరుగుతుంది. అలాకాకుండా ఒంటరి పోరాటం చేస్తూ ఉంటే ఎంతకాలమైనా సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు.

ఈ మధ్యకాలంలో జరిగిన వివేక్ సైనీ దారుణ హత్య, సమీర్ కామత్ విషాదకరమైన ఆత్మహత్య, నీల్ ఆచార్య మరియు అకుల్ ధావన్‌ల అనూహ్య మరణాలతో అమెరికాలో స్థిరపడినటువంటి భారతీయుల యొక్క పరిస్థితుల పైన విషాద నీలిచాయిలు కలగటమే కాకుండా భారత దేశంలో ఉన్నటువంటి వారి కుటుంబాలు ఆందోళనలో ఉండటం జరుగుతుంది. బహుశా ఈ సంఘటనలు అమెరికాలో ఉన్నటువంటి సంక్లిష్టమైన సామాజిక వాస్తవాలను వెలికితిస్తున్నట్లుగా ఉన్నాయి. అందువలన పరిస్థితులపై అవగాహన పెంచడం మరియు మెరుగైన భద్రతా చర్యల అవసరం గురించి జాగ్రత్తగా యోచన చేయటం ఎంతైనా అవసరం. వేరొక గడ్డ అభ్యున్నతికి వేయింపవళ్ళు కష్టపడుతున్నటువంటి, అమెరికా భారతీయులకు కనీస భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అయితే తమ భద్రత గురించి జాగ్రత్త పడటం ప్రతి ఒక్కరు బాధ్యతగా కూడా గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వేరొక దేశం చక్కటి జీవనం సాగించాలని వెళ్తున్నామే కానీ జీవితం చాలించాలని కాదు.
visit arjasrikanth.in / @DrArjasreekanth for more insights